Tuesday, June 5, 2012

నా బాల్యం - వీరంగం '2'

నా బాల్యఖర్మలు తరువాయి భాగం :
                                  
                                    6.  మొన్న మా అమ్మగారిని నా చిన్నప్పటి చేష్టలు ఏమైనా చెప్పమంటే క్రింది విషయం చెప్పారు. నాకు చిన్నప్పటి నుంచి పౌరుషం(కొన్ని భాషల్లో తిక్క అని కూడా అంటారు) ఎక్కువ. సరిగా గుర్తులేదు షుమారుగా మూడో తరగతి చదివేటప్పుడు మా పాఠశాల రెండు వీధుల అవతల వుండేది. ఒక రోజు స్నానం చేసి టవల్ చుట్టుకు వచ్చి ఏ బట్టలు వెసుకోమంటావు అని అడిగితే (ఆ రోజు యునిఫార్మ్ వెసుకోవాలి ;)) ఎదో పని చేసుకుంటున్న మా మాతృమూర్తి అలగే వెళ్ళరా అని అన్నరట. చెప్పాగా నాకు పౌరుషం ఎక్కువ అని మారు మాట్లాడకుండా  "పాఠశాలకి అలాగే వెల్లిపోయా". టవల్ యునిఫార్మ్ కాదు కనుక నన్ను తిరిగి ఇంటికి పంపేసారు.
                                    7.  నేను చిన్నప్పటి నుంచి ఆగష్ట్ 15, జనవరి 26 అంటే  దేశభక్తితో  ఉపన్యాసాలు తప్పక ఇచ్చేవాడిని.   అలా ఒక జనవరి 26వ తేదీన దేశభక్తుల గురించి ఉపన్యాసం తయారు చేసుకువేళ్ళా.            చంద్రశేఖర ఆజాద్ చిన్నతనంలో తెల్లవాళ్ళు వందేమాతరం అనే భారతీయులని కొడుతుంటే తిరగబడి రాయివిసిరి   తెల్లవాడి తలపగలకొడతాడు. చెప్పాల్సిన విషయం ఇది. నేను ఉపన్యాసం మధ్యలో "రాయితీసుకుని.. "తర్వాత    స్క్రిప్ట్  మరిచిపోయా. రాయితీసుకుని పుచ్చలు పగలకొట్టాడు అని ఉపన్యసించా. ఇంకేముంది ఒక నెల రోజులు ఎవరు ఎక్కడ  కనపడ్డా " పుచ్చలు పగిలాయా  ఇంతకీ .." అని అడిగేవారు పక పక  పళ్ళు బయటపెట్టి నవ్వుతూ .
                                    8. నాకు ఎదైనా సందేహం వస్తే వెంటనే లేచి ప్రశ్నఅడిగే వాడిని. ఆరో తరగతిలో ఉన్నప్పుడు మాకు ఆంగ్లం నేర్పించటానికి కొత్త మేడం వచ్చింది. అర్ధాలు చెపుతూ
                                                                      marriage = పెళ్లి అని చెప్పింది.
నా పక్కన గోపాల్ అనే ఆదిమ మానవ వెధవ, మరి శోభనంని ఏమంటారు అని నన్నడిగాడు. నాకూ  తెలీదు, వాడి సందేహం నా సందేహమయ్యింది. ఠక్కున లేచి మేడం మరి శోభనంని ఏమంటారు అని అడిగా. ఆమె సమాధానం చెప్పకుండా  నాకు పెళ్లి చేసింది. ఆ రోజునుంచి వాడు నేను శత్రువులం ..
                                    9. మేము చిన్నప్పుడు ఇంకుపెన్లు బాగా క్రేజ్.  నా తరగతిలో సుధాకర్ అని ఉండేవాడు. వీడు పచ్చి తాగుబోతు. వీడికి ఇంకుపెన్ ఎవరూ ఇచ్చేవాళ్ళు కాదు. వెధవ ఇంకు తాగేసి పెన్ లో కుళాయిలో నీళ్ళు పట్టి ఇచ్చేవాడు.
                                    10.  ఏడో తరగతి లో ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం క్యారేజి తీసుకువెళ్ళేవాడిని.
6, 7 తరగతి గదులు వరసగా ఉండేవి. 6 వ తరగతి  వాళ్ళు కూడా బాక్స్ లు తెచుకుని మా తరగతిగదిని గందరగోళం చేసేవాళ్ళు. హరిణి అని 6వ  తరగతి పిల్ల నా బెంచ్ లో కూర్చొని పాడుచేస్తుంటే (తింటుంటే)             'ఇడ్లీ తిని డేడ్లీ' గా బెదిరించా ఇక్కడినుంచి లెమ్మని.  లేవక పోగా తిరిగి నన్ను బెదిరించింది. నేను ఇదివరకే చెప్పాగా నాకు పౌరుషం ఎక్కువని, నా క్యారీజి తీసుకుని ఆ పిల్లని తరుముకుంటూ వెళ్ళా, పక్కనే వున్న బాత్రూంలో వెళ్లి దాక్కుంది మన దెబ్బకి జడిచి. ఆ మాత్రం భయం వుండాలి అనుకుంటూ బయట గడియ పెట్టి నాపాటికి నేను వచ్చేసా.
              లంచ్ తర్వాత, రెండో  పీరియడ్ లోసోషల్  పరీక్ష వుంది దానికి మొదటి పీరియడ్ లోరహస్యంగా చదువుతూ పేజీలు  తిప్పుతుంటే, ఆయ వచ్చి 7వ తరగతి సురేష్ ని ప్రధానోపాధ్యయులు పిలిస్తున్నారు అని చెప్పింది. ఈయనకి నన్ను చూడందే రోజు గడవదు అనుకుంటూ లేచి కాలర్, కళ్ళు ఎగరేసి అందరినీ ఒకసారి చూసి బయలుదేరా. ఇంతకీ ఏమయ్యివుంటుంది విషయం అనుకుంటూ అక్కడకి వెళ్లేసరికి పిల్ల పిశాచి హరిణి కనిపించింది. నాకు విషయం అర్థంఅయ్యింది. సరిగ్గా అ లాంటి సమయాల్లో నాకు దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడా ఈ గండం గట్టేక్కిస్తే నీకు రెండు కమ్మరికట్టలు కొనిపెడతా అని దణ్ణంపెట్టుకున్నా. మీ తల్లితండ్రులని తీసుకునిరా వెళ్ళి అన్నాడు. ఇదొకటా ఇక్కడే ఐతే ఏదో 4 దెబ్బలతో సరిపోతుంది ఇంట్లో కూడా తెలిస్తే వామ్మో, నేనేమి మాట్లాడలేదు.
చేతులు చాచమని రూళ్ళ కర్ర తీసుకొని 4 పీకి,  మోకాళ్లమీద కూర్చోమని చెప్పాడు. ఏడుపుమొహం పెట్టి అలాగే చేశా లేదంటే మళ్ళా రూళ్ళకర్రచేసుకుంటాడు. తర్వాత తెలిసింది ఆ పిల్ల చాలాసేపు అలా బాత్రూంలో తలుపు కొడుతూ ఉండిపోతే ఆయా వెళ్లి తీసిందంట. నా మీద ఫిర్యాదు ఇమ్మని చెప్పింది కూడా ఆయానే అంట.. ఈ ఆయాలకి నాకు ఎప్పుడు పడిచావదు.. 




2 comments:

  1. చాలా బాగుంది సురెష్ గారు. ఇడ్లీ తిని డెడ్లీగా బెదిరించారు చూడండి.....అది అదిరిపొయింది :)

    ReplyDelete