Wednesday, July 25, 2012

నువ్వు


రాత్రి ఎప్పుడు నిద్రపోయానో తెలీదు
నువ్వు నిద్ర లేపుతున్నట్టనిపిస్తే మెళకువ వచ్చింది
కళ్ళెదురుగా నువ్వు, నీ నవ్వు
కళ్ళు తెరిచానేమో అనుకున్నా, లేదు
కళ్ళు మూసుకొనేవున్నా మెలకువగానే వున్నా
కాని ఎదురుగా నువ్వు, నీ నవ్వు

లేచి ఏపని చేస్తున్నా
నావెంటే నువ్వు, నీ నవ్వు
రోజంతా మనసు నిండా ఆలోచనలు
ఆలోచనల నిండా నువ్వు, నీ నవ్వు
నేను నిన్ను చూసినప్పటి నుంచి
నా కళ్ళెదురుగా నువ్వు, నీ నవ్వు

పిలవటానికి నీపేరు తెలీదు
మరలా చూడటానికి నువ్వెక్కడుంటావో తెలీదు
రోజూ నిన్ను చూసిన చోట వెతుకుతున్నా
దూరంగా నుంచొని నావైపు చూస్తూ నువ్వు, నీ నవ్వు
దగ్గరగా వస్తే తిరిగి
దూరంగా నుంచొని నావైపు చూస్తూ నువ్వు, నీ నవ్వు..

Monday, July 16, 2012

ఒంటరితనం


నా పై అనంతమైన శూన్యం, అంతులేని ఆకాశం

పొద్దు పొడిచే సూర్యుడికి ఎదురుగా నుంచున్నా
నువ్వొక్కడివే అంటూ వెక్కిరిస్తూ, నాలోని ఒంటరితనం
తిరిగి చూస్తే నేనున్నా నీకు తోడు అంటూ నా నీడ
మనసులొని వెలితిని తుడిచేస్తూ, ఎదో ఒక తృప్తి

కాలం గడిచింది, ఎదురుగా ఉన్న సూర్యుడు నడినెత్తి చేరాడు
నా నేస్తం అన్న నా నీడ నాకు కనిపించలేదు
వెతికి చూస్తే కనుమరుగయ్యే రీతిలో నా క్రింద, తలవంచి చూడమంటూ
తిరిగి మనసులో ఒంటరినేమో అని తొనికిసలాడే, ఎదో ఒక అసంతృప్తి

కాలం గడిచింది, ప్రొద్దు వాలుతూ సూర్యుడు
తిరిగి నా తోడు, మసక మసకగా అంతరిస్తూ  నా నీడ
చిలిపి నవ్వులు నవ్వుతూ, నాలోని ఒంటరితనం
అప్పుడర్ధమయ్యింది  నా నిజమైన నేస్తం ఒంటరితనం

ఇప్పుడు నాలో అనంతమైన శూన్యం, అంతులేని ఆనందం ..