Friday, February 21, 2014

ఇదీ నిజమైన బ్రహ్మచర్యం....ఇదీ నిజమైన హైందవ ధర్మం.....


ఇదీ నిజమైన బ్రహ్మచర్యం....ఇదీ నిజమైన హైందవ ధర్మం.....

స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికా వనిత వచ్చి స్వామిని ఇలా అడిగింది.

"స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు అంగీకరిస్తారా"

స్వామి ఆమెను "మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది" అని అడిగారు.

అందుకామె " మీ తెలివితేటలు నాకు నచ్చాయి. అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది" అన్నది.

స్వామి ఆమె మాటలకి ఇలా సమాధానమిచ్చారు.

" నాతెలివితేటలు మిమ్మల్ని ఆకర్షించాయి కాబట్టి మీ కోరికను తప్పు బట్టను. నాలాంటి బిడ్డను కావాలనుకోవడం తప్పు కాదు కాబట్టి. కాని దానికి పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది. పైగా అలా జరుగుతుందని నిశ్చయముగా చెప్పలేము. మీ కోరిక తీరడానికి, నిశ్చయమైన సులువైన మార్గము ఒకటి చెబుతాను. ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను. మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. నావంటి తెలివితేటలు కలిగిన వ్యక్తిని బిడ్డగా పోందాలనే మీ కోరిక ఇప్పుడే నెరవేరింది." అని ఆమెకు నమస్కరించారు.
వివేకానందుడి మాటలకు ఆ అమెరికా వనిత అవాక్కయింది.

లే. మేల్కో. పొందవలసినదీ, చేరవలసిన గమ్యం గూర్చి తెలుసుకో
సనాతన ధర్మాన్ని పాటిస్తూ, హిందువునని ఆ వివేకానందుడి వారసులమని గర్వంగా చెప్పుకో.

Thursday, February 20, 2014

సంధ్యా వినోదాలు

ఎదురింటి పూరి గుడిసెలో పిల్లవాడి ఏకపాత్రాభినయం
పూలు మరచానని ఆడదాని మూతివిరుపు
సందు మలుపులో బామ్మ పులిబొంగరాల గుబాలింపు

రోజంతా అలసి నడుం వాలుస్తూ సూరీడు
నీలాన్ని తుడిపేసి ఎరుపు నలుపుల కల్లాపి చల్లుతూ
ఆకాశంలో చందురుడు
మార్పులో మత్తు మాధుర్యం మనసుకి చెబుతూ సాయం సంధ్య...

సొగసులు

కలువ రేకులు, విప్పారిన ఆ కనురెప్పలు
కలలు, కోల కనుల కొన చూపులు
కలవరింతలు, కలల చిన్నారి కవ్వింతలు
వలలు, వయ్యారి వలువలు
వెతలు, వేడి నిట్టూర్పుల వేచి చూపులు

అలకలు, పలకరింతల కొరవడులు
బుజ్జగింపులు, ముఖారవిందాల అందాల చిరునగవులు
పులకరింతలు, పలకరింతల ఆత్మీయ స్పర్శలు
తహతహలు, తనువుల తాకిడుల ఎదురు చూపులు
స్వర్గాలు, వెచ్చని కౌగలింతల చుంబనాలు
నరకాలు, విరహపు గడవని ఘడియలు

ఆహా! ఎన్నెన్ని సొగసులు